
మహారాష్ట్రలోని Pimpri-Chinchwad పరిధిలో మరో కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. మోషి ప్రాంతంలోని ఓ దుస్తుల దుకాణంలో యువకుడు తన ప్రేయసిపై అమానుషంగా దాడి చేసిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఈ సంఘటన మే 27, 2026 సాయంత్రం సుమారు 4:47 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. దుకాణంలో జరిగిన వాగ్వాదం క్రమంగా హింసాత్మక రూపం దాల్చింది. అనుమానాల నేపథ్యంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో యువకుడు కోపంతో యువతిని పలుమార్లు కొట్టినట్లు వీడియోలో కనిపించింది.
నాలుగు నిమిషాల పాటు కొనసాగిన దాడి
సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, యువతి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ యువకుడు ఆమెను నిర్దాక్షిణ్యంగా కొట్టడం, తోసేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటన దాదాపు నాలుగు నిమిషాల పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. అక్కడే ఒక చిన్నారి ఉండటం పరిస్థితిని మరింత కలచివేసింది.
వీడియోలో తరువాత యువకుడు యువతి కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పిన దృశ్యాలు కూడా కనిపించాయి. అయితే, ఈ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నిరాకరించినట్లు సమాచారం. ఇది “వ్యక్తిగత విషయం” అని ఆమె పేర్కొన్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. దీంతో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు జరగలేదు.
