
ప్రపంచాన్ని మరోసారి ఎబోలా వైరస్ కలవరపెడుతోంది. ఆఫ్రికాలోని కొన్ని దేశాల్లో తాజాగా కేసులు నమోదవుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈ వైరస్ చరిత్రను పరిశీలిస్తే, గతంలో ఎన్నో దేశాల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు ఉన్నాయి. అందుకే తాజా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎబోలా వైరస్ మొదటిసారి 1976లో ఆఫ్రికాలో గుర్తించారు. అప్పట్లో సూడాన్, కాంగో ప్రాంతాల్లో కలిపి 600కు పైగా కేసులు నమోదై, దాదాపు 430 మంది మృతి చెందారు. అప్పటి నుంచి ఈ వైరస్ పలు దఫాలు వ్యాప్తి చెందుతూ వస్తోంది.
అత్యంత ప్రమాదకరమైన వ్యాప్తి 2014-2016 మధ్య పశ్చిమ ఆఫ్రికాలో జరిగింది. అప్పట్లో గినియా, లైబీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో కలిపి 28,000కు పైగా కేసులు నమోదయ్యాయి. అందులో 11,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద ఎబోలా విపత్తుగా నిలిచింది.
తర్వాత 2018-2020లో డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మరోసారి వైరస్ విజృంభించింది. ఈ దఫా 3,470 కేసులు నమోదవగా, 2,287 మంది మరణించారు. ఈ సమయంలో అంతర్జాతీయ సహకారంతో వైరస్ను అదుపులోకి తెచ్చారు.
ఇటీవల నమోదైన తాజా కేసుల్లో 246 అనుమానిత కేసులు, 8 నిర్ధారిత కేసులు, 80కిపైగా మరణాలు నమోదైనట్లు ఆరోగ్య సంస్థలు వెల్లడించాయి. ఇది బుండిబుగ్యో రకం వైరస్ కావడంతో ప్రత్యేక వ్యాక్సిన్ లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఎబోలా ప్రధానంగా సోకిన వ్యక్తుల రక్తం, శరీర ద్రవాలు, కలుషిత వస్తువులు లేదా సోకిన జంతువుల ద్వారా వ్యాపిస్తుంది. మొదట జ్వరం, తలనొప్పి, అలసటగా మొదలై తర్వాత తీవ్రమైన రక్తస్రావానికి దారితీస్తుంది. చికిత్స ఆలస్యమైతే మరణ ప్రమాదం ఎక్కువ.
గత గణాంకాలు చూస్తే ఈ వైరస్ ఎంత ప్రమాదకరమో స్పష్టమవుతోంది. అందుకే ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని WHO సూచించింది. ముందస్తు జాగ్రత్తలు, వేగవంతమైన వైద్య చర్యలతోనే ఎబోలా ముప్పును అడ్డుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
