
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఇంజినీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. విద్యుత్ శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న మొత్తం 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో త్వరలోనే నియామక ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం.
రాష్ట్రంలోని వివిధ విద్యుత్ సంస్థల్లో ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి:
ఏపీ ట్రాన్స్కో – 200 పోస్టులు, ఏపీ జెన్కో – 100 పోస్టులు, ఏపీఎస్పీడీసీఎల్ – 134 పోస్టులు, ఏపీసీపీడీసీఎల్ – 60 పోస్టులు, ఏపీఈపీడీసీఎల్ – 135 పోస్టులు
విద్యుత్ రంగంలో సిబ్బంది కొరత కారణంగా అనేక సేవలు ప్రభావితమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త నియామకాలతో విద్యుత్ సరఫరా, నిర్వహణ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు ఈ ప్రకటన పెద్ద ఊరటనిచ్చింది. త్వరలో అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముండటంతో అభ్యర్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది మంచి అవకాశం అని నిపుణులు చెబుతున్నారు.
