
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం విడుదల రోజే అనూహ్య సమస్యల్లో చిక్కుకుంది. మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా షోలు అకస్మాత్తుగా రద్దవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇదే సమయంలో ఉత్తర భారతదేశంలోని కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించబడినట్లు సమాచారం రావడం చిత్రబృందాన్ని కలవరపరిచింది.
ఈ ఘటనపై నిర్మాతల మండలి సమావేశం అనంతరం స్పందించిన నిర్మాత ఎస్.ఆర్. ప్రభు, తమ అనుమతి లేకుండానే ముంబయి, పుణే వంటి ప్రాంతాల్లో సినిమా ప్రదర్శితమైందని వెల్లడించారు. ఈ పరిణామంతో సినిమా పైరసీకి గురయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫైనాన్షియర్లతో చర్చలు కొనసాగుతున్నాయని, సమస్యను త్వరగా పరిష్కరించి రాత్రికల్లా విడుదలకు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
ఇక నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కూడా అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, అనివార్య కారణాల వల్ల ఉదయం షోలను నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపింది. మధ్యాహ్నం ప్రదర్శనలు ఉంటాయేమోనని ఆశించిన ప్రేక్షకులకు కూడా నిరాశే ఎదురైంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి సంబంధిత బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు రీఫండ్ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాలపై దర్శకుడు ఆర్జే బాలాజీ సోషల్ మీడియాలో భావోద్వేగంగా స్పందించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు తనను తీవ్రంగా కలచివేశాయని, కన్నీళ్లు ఆగడం లేదని పేర్కొన్నారు. సాయంత్రానికల్లా సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, సినిమా ఈరోజే విడుదలయ్యే అవకాశాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయి.
