
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23.51 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యులకు ఉపయోగపడేలా కొత్త క్యాష్‌లెస్ హెల్త్ సెక్యూరిటీ స్కీమ్‌ను అమలు చేయనుంది.
ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ప్రత్యేక డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేయనున్నారు. వీటి ఆధారంగా ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నగదు చెల్లించకుండా వైద్యం పొందే అవకాశం కల్పించనున్నారు. ప్రభుత్వం జూన్ 2వ తేదీ నుంచి హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేసింది.
రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ పర్యవేక్షణలో అమలుకానున్న ఈ స్కీమ్ కింద సుమారు 1,998 రకాల వ్యాధులకు ఉచిత చికిత్స అందించనున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 421 ప్రైవేటు ఆస్పత్రులను ఈ పథకంలో భాగస్వామ్యం చేశారు.
భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లకు ఈ పథకం ద్వారా పెద్ద ఊరట లభించనుంది. అత్యవసర చికిత్సల సమయంలో ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఇక ఆరోగ్య రంగంపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్యశాఖకు రికార్డు స్థాయిలో రూ.13,679 కోట్ల నిధులు కేటాయించింది. ఉద్యోగుల సంక్షేమం కోసం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
